హైదరాబాద్, వెలుగు: ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా స్పీకర్ ను, స్పీకర్ కుర్చీని గౌరవించాల్సిందేనని, స్పీకర్ను అవమానించిన వ్యక్తిని శాశ్వతంగా బహిష్కరించాల్సిందేనని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు వ్యక్తికి మాత్రమే కాదని, సభ మొత్తానికి జరిగిన అవమానమని అభిప్రాయపడ్డారు. స్పీకర్ ను, ఆయన తల్లిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఎస్సీ, ఎస్టీల కోసం అట్రాసిటీ ఆయుధాన్ని తీసుకొచ్చినా వారికి న్యాయం జరగడంలేదని శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాలకు అందేలా చూడాలని భావించే పార్టీ బీజేపీ ఒక్కటే అన్నారు. స్పీకర్ను అవమానించేలా మాట్లాడిన వ్యక్తిని శాశ్వతంగా సభ నుంచి బహిష్కరించాలని, దీనికి బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. 'తప్పు చేసే వారికి అండగా ఉండే పార్టీ బీజేపీ కాదు.. న్యాయం వైపు నిలబడే పార్టీ మాది' అని స్పష్టంచేశారు.
